గాయత్రి వార్తలు - జాతీయం / తిరుపతి :
ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రథయాత్ర ఆలస్యం కావడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.